నానాటి బతుకు నాటకము సాహిత్యం...
పల్లవి:
నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము
చరణాలు
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్ట నడిమి పని నాటకము
ఎట్టా ఎదుటా గలది ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము
కుడిచేదన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము
ఒడి గట్టుకొనిన ఉభయకర్మంబుల
గడిదాటిన పుడె కైవల్యము
తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
ఎగువన శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము