Thursday, July 7, 2016

తిక్కన - కీచకవధ - తిక్కన రచనా విధానం - నాటకీయత

తిక్కన

కీచకవధ - తిక్కన రచనా విధానం - నాటకీయత

       కీచకవధ ఘట్టంలో తిక్కన ప్రదర్శించిన తీరు నాటకీయత  శ్రావ్యములు  దృశ్యకావ్యములని శ్రవ్యకావ్యములని రెండు రకములు పాఠకుడు చదివుకొని మానసికోల్లాసము పొందుట శ్రవ్యకావ్య లక్షణంచదివినకొలది మధుర మధురములుగనుండుదృశ్యకావ్యమట్లు కాదు నిరక్షరాస్యుడైనను కావ్యమును తరతరాలు చదువుచుందురు, కావ్యమందలి విషయము, వస్తు వర్ణన, పాత్ర చిత్రణ, సంభాషణ నైపుణ్యము కళ్ళకు కట్టినట్టుండ అతనొక నాటకమునో లేక చలనచిత్రమునో చూస్తున్నట్టు తన్మయుడగును. తన గూర్చి తిక్కన విరాట పర్వమాదిలో, "అమలోదాత్తమనీష నేనుభయకావ్యప్రౌఢిపాటించు శిల్పమునం బారగుడం..." అని చెప్పుకున్నాడు. నేనేది వ్రాసినా తెలిసి వ్రాస్తాను అని చెప్పే ధిషణా శక్తి, మనీష, ఉదాత్తమైన బుద్ధితో ఉభయ కావ్యాలలోను కవులు ప్రదర్శించి ప్రౌఢిని పాటించే శిల్పంలో ఆయన నిష్ణాతుడట. ఉభయ కావ్యాలలో సంస్కృతాంధ్ర కావ్యాలని, దృశ్య, శ్రవ్య కావ్యాలని, మార్గ దేశి కావ్యాలని, పద్య చంపు కావ్యాలని, శాస్త్ర, రస కావ్యాలని ఇలా చెప్పుకొనవచ్చును. సామాన్య పదాలతో  అసామాన్యమైన అర్థ స్ఫురణం కలిగించడం ప్రౌఢి. వర్ణించుచున్న వస్తువు యొక్క శీలాన్ని (స్వభావాన్ని) సార్థకంగా స్ఫురింపచెయ్యడం లేక ధ్వనింపచెయ్యడం శిల్పం. మనలో కూడా ఒక్కొక్కరి మాట తీరు మనల్ని ఆకట్టుకుంటుంది. అది అతని ఉక్తి వైచిత్ర్యం. నన్నయ ప్రసన్న కథాకథన శైలిలో అక్షరరమ్యత్వాన్ని, నానారుచిరార్థ సూక్తులను  నిక్షిప్తం చేస్తే తిక్కనది. ప్రొఢ శిల్పోక్తి. వ్యంగ్యార్థ  ప్రధానమైన  రమణీయ శబ్దాలను రసానుకూలమైన గుణరీతులలో ప్రదర్శించిన కవి తిక్కన. తిక్కన రసధ్వని దర్శనానికి చెందిన గుణవాది. కనుకనే నన్నయ వస్తుధృనికీ, తిక్కన రస దృనికీ, ఎర్రన అలంకార దృనికీ తమ కవిత లో ప్రాధాన్యం ఇచ్చారు.
          తిక్కన శ్రీయన గౌరినాం బరంగు చెల్వకుచిత్తము  పల్లవింప అని ఎత్తుకున్న విరాట పర్వము హృదయాహ్లాది చతుర్థ మూర్జిత కథోపేతంబు. నానారసాభ్యుదయోల్లాసియును. విరాటపర్వంలో ఐదు ఆశ్వాసాల్లో ప్రథమాశ్వాసంలో ముఖసంధి, ద్వితీయాశ్వాసంలో ప్రతిముఖ సంధి, తృతియాశ్వాసంలో గర్భసంధి, చతుర్థాశ్వాసంలో విమర్శసంధి, పంచమాశ్వాసంలో నిర్వహణ సంధి నిర్వహించబడ్డాయి. నాటిక వస్తువుకెంతటి నిర్మాణ సౌష్ఠవం ఉండాలో అంతటి బిగువు విరాటపర్వ కథలో ఉంది.
          తిక్కన రచనను (మాతృకను) మక్కికిమక్కిగా అనువదించలేదు. మూలాలలోని భావాన్ని పాత్రలను తన కళ్లకు ప్రత్యక్షం చేసుకొని  తన భావుకత, కవితానైపుణ్యం, లోకజ్ఞానం, ఔచిత్యం మనసులో ఉంచుకొని ఒక్కొక్క పదాన్ని త్రాసులో తూచినట్టు రసపుంతంగా ప్రయోగించాడు.
          అవసరం అనుకుంటే మూలాన్ని పక్కన పెట్టాడు, మార్పులు చేసాడు. రసబంధురంగా ఉండేందుకు వ్యాసుడు వ్రాయని వర్ణనలను తాను కల్పించాడు. సూర్యాస్తమయ నర్తనశాల ఇత్యాదులు కల్పించాడు. మచ్చుకు చూద్దాం... సూర్యాస్తమయంలో పడమటి దిశాంగన రాగరంజితమైంది, వేళా విశేషంగా చుక్కలు మెరిస్తున్నాయీ, జనసమ్మర్దం తగ్గుతున్నది, విటుల మన్నస్సులో మద భావం  విజృంభిస్తున్నది, చంద్రాస్తమయం అయింది, నేలపై ఎత్తు పల్లాలు తెలియని విధంగా చీకటి అలుముకుంది వర్ణనలో కీచకుని కామోన్మత్త విజృంభణం, మంచి చెడు విచక్షణా జ్ఞానశూన్యత ధ్వనించుతున్నాయి. భీముడు పెండ్లికి ఉల్లాసంగా కీచకవధకై నర్తనశాలకు ఒక తలపాగా వంటిది ధరించి తన నడకలో ఎక్కడా విపరీత చేష్టలు లేకుండా తన మనస్సులోని యుధ్ధసన్నాహం బయట పడనీకుండా చాలా సంయమనం పాటిస్తు చుట్టుపక్కల బాగా గమనించుకుంటూ ద్రౌపదిని తన వెనకాలే రమ్మని నర్తనశాలకు  వెళ్ళాడు. తిక్కన నర్తనశాలను వర్ణించుచూ అది వివేక రహితుడైనవాని హృదయం వలే తమస్సనే అజ్ఞానంతో నిండివుండే ప్రౌఢనాయిక డ్రామావలే తెలియరానిదిగా ఉంది, భయంకర అరణ్యంవలే నిర్మానుష్యంగా ఉంది, నీఛ పురుషుని సంపాదనవలే నిరుపయోగంగా ఉందిచదవబడని శాస్త్రంవలే అగమ్యంగా ఉంది, కలలోని వస్తువు వలే కంటికి కనిపించనిది, అలంకార ప్రయోగాలు స్పష్టంగా లేకపోవడం వలన కష్టమైన కావ్యంలా ఉంది, జార చోరులకు సంతోషం కలిగించే దుర్మార్గ రాజ్యంవలే ఉందిట. వ్యాసుడు వర్ణనజోలికి పోకుండా భీముని ఒంటరిగా తిన్నగా నర్తనశాలకు నడిపించాడు. తిక్కన వర్ణనా శైలిని పరికించినా అతడెంతటి వివేకియో తెలుస్తున్నది. నర్తనశాల కీచక వధస్థలం కాబోతున్నది, నర్తనశాల ఏది గోడయో ఏది ద్వారమో తెలియనంతగ చీకటి దాల్చినట్లున్నది. కీచకుని శవం కూడా తలఏదో మొలఏదో తెలియని స్థితిలో తయారవబోతున్నదని ధ్వని. భీముడు ఉత్తర యొక్క లీలా పర్యంకం మీద చీకటిలో పడుకున్నాడు. ద్రౌపది ఆ ప్రక్కన కనపడకుండా దాక్కుండమన్నాడు. కామోన్మత్తులో కీచకుడు సింహం ఉన్న గుహకు ఏనుగు పోయినట్లు నర్తనశాలకు పొయాడు. సింహవిజయం గజసంహార సూచకం. సైరంధ్రి తప్పకుండ తనకై నర్తనశాలకు వచ్చి ఉంటుందనే భావనలో కీచకునికి వొళ్ళు తెలియదం లేదు. ఇదంతా మూలంలో లేదు. పక్కన కూర్చొని మీద చెయ్యి వేసాడు కీచకుడు. భీముడు లోపల అగ్ని పర్వతంలా ఉన్నా చాలా సంయమనంతో పడుకొని ఉన్నాడు. ఇక కీచకుడు వాడి మదోన్మత్త ప్రవాహం సాగించాడు. మాలిని కోసం వాడు యెన్నో వేలవేల వస్తువులను సమకూర్చి వచ్చాడు. తనను గూర్చి తాను గొప్పగా - త్రాగి ఒళ్ళు తెలియని వాడెవడైనా వాడే జగదేకవీరుడిననీ వాగినట్లు - తనను చూసిన స్త్రీ అయినా ఇతరులను లెక్క చెయ్యదని, వెంటనే తన మీద వాలి పోతుందనీ, లేకపోతే మన్మథుని బాణాగ్నిలో దగ్ధమైపోతుందనీ - అటువంటి తనను ఈనాడు మాలిని ఆకర్షించి ఏలుకుంటున్నదని ప్రలాపించాడు. భీముడు ఒక్క ఉదుటున లేచి వాణ్ణి చంపవచ్చు. కాని భీముడు కూడ అప్పుడు గొంతు మార్చి చాలా మృదువుగా అటువంటి వాడవైన నిన్ను నువ్వు పొగడుకోవచ్చు, కాని నీకు నా వంటి స్త్రీ ఎక్కడా లభ్యపడడు. నీకు నాతో సంగమం జరిగినప్పుడు నీవు నన్ను ఇతర స్త్రీలతో పోల్చినావని నీ తప్పు నీవే తెల్సుకుంటావు. నన్నొక్కసారి ముట్టినాక నువ్వు జీవితంలో మరొక ఆడదానిని కోరవు. ఆడువారి పొందుకు పోలేని స్థితి పొందుతావు (చస్తావని భావం) అన్నాడు. అంటునే ఒక్కసారిగా కీచకునిపై పడి వాడి తల వొంచి పట్టి ఉంచాడు. కీచకునికి కైపు దిగింది. వారిద్దరికి యుద్ధం జరిగింది. సమయంలో వారి మల్ల యుద్ధంలో వెదుళ్ళు  పగిలిన శబ్దం వంటి చప్పుడు పుట్టింది - అని వ్యాసుడు వ్రాస్తే, తన అగచాట్లు ఇతరులు చూస్తే పరువు పోతుందని కీచకుడు, అజ్ఞాతవాసం భంగమవుతుందేమోనని భయంతో భీముడు ఎవ్వరికి తెలియకుండా వినిపడకుండ చప్పుడు కానట్టి పిడికిటి పోట్లతో కుమ్ముకున్నారు, గుద్దుకున్నారు అని తిక్కన వ్రాసి బీభత్సం ప్రకటించాడు. తిక్కన మల్లయుద్ధ గతులను వర్ణించాడు. కీచకుని బలముడగడం కనిపెట్టి భీముడు వాడి ఆయువుపట్లలో కొట్టి ప్రాణం తీసాడు. అది ఎలా అంటే ఫలపుష్పభరితమైన ఒక చెట్టును మదపుటేనుగు ఎంత అవలీలగా కూలుస్తుందో అలాగట. కీచకుడు చచ్చినా భీముని కోపాగ్ని చల్లారలేదు. గతం లో భీముడు బక, కిమ్మిరాది రాక్షసులను సంహరించాడు. సమయంలో ద్రౌపదికి అవమానం జరగలేదు. అందువల్ల భీమునకు పట్టరాని ఆగ్రహం కల్గలేదు. అది కేవలం దుష్టభంజనం. ఇప్పుడు ద్రౌపదికి క్రిందటి సభలో జరిగిన అవమానాన్నికీచకుడు ద్రౌపదిని కిందకు పడద్రోసి తన్నడం) భీముడు కళ్ళారా చూసి ధర్మరాజు కనుసైగ తో ఆగిపోయాడు. ద్రౌపది తనకు అనుక్షణం భయంగా ఉందని కీచకుని తెల్లారేలోగా చంపకపోతే తాను విషం తాగి చనిపోతానని భీమునితో చెప్పి ఏడ్చిందిఇది మూలంలో ఉంది ). కనుక ద్రౌపదీ భీములకు పరాభవాగ్ని చల్లారడమే కాదు, మాలిని వంక కన్నెత్తి ఎవరైనా చూస్తే వారి గతి ఇంతే అని ఒక సందేశం కూడా ఇవ్వాలి. అందువల్ల కీచకుని వికృతంగా చంపాలన్న ఊహ భీమునకు కలిగి, వాడి మొండెం  భాగం లోనికి చీల్చి అందులో కాళ్ళు చేతులు తల దూర్చిబాగా చిదిమి అది తల తోక తెలియని ఒక మాంసపు ముద్ద వలె చేసాడు. అది గంధర్వగోళం అయింది. మన మాటల్లో అది  గందరగోళం అయింది.  భీముడు రహస్యంగా నిప్పు తెచ్చి ఆ  వెలుగులో కీచకుని శవాన్ని ద్రౌపది కి చూపాడు పగతో భయంతో అవమానభారంతో ఉన్న ద్రౌపది కీచకుని శవాన్ని చూసి భయపడింది, ఆశ్చర్యపడింది సంతోషం చెందింది, ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుని, "ఒరే కీచక దీని కోసమేనా ఇంత చేసావు శాంతించు నన్ను భాదించిన నీకు ఇట్లా జరగకుండా పోతుందా!" అంది . 
          నేనన్నది నెరవేర్చాను ద్రౌపది అవమానాన్ని దుఃఖాన్ని పోగొట్టానని ఉప్పొంగిపోతూ భీముడు ద్రౌపదిని అయిదు ప్రశ్నలు అడిగాడు  
1. ద్రౌపదీ  నీ మనస్సులో చింత అన్న ములికి తొలిగిందా?
2. నా భుజ బలం ఏమిటో తెలిసిందా, నీ మెప్పుకెక్కిందా?
3. నీ కోపాగ్ని చల్లారిన్దా?
4. చచ్చిన ఈ దుర్మార్గుని చూసావా?
5. సంతోషం కలిగిందా 
అని నీ జోలికి వచ్చినవానికి నా చేతిలో మూడింది అన్నాడు . దీనికి గతంలో ద్రౌపది కీచకుని నర్తనశాలకు ఒంటరిగా రమ్మని సందేశం ఇచ్చి భీముని దగ్గరకు వచ్చి, నే చేయాల్సిందంతా నే చేసాను . నేనెలా కార్యనిర్వహణ చేస్తానో అని సవాలు విసరినట్లు చెప్పింది దానికి జవాబీ భీముని ప్రశ్నలు . 
          మనస్సులో సంతోషం వెల్లివిరుస్తుండగా ద్రౌపది భీముని ప్రశ్నలకు ధీటుగా ఐదు జవాబులు ఇచ్చి భీముని మెప్పించింది
   1. నిన్న విరాటుని కొలువులో అంత ప్రళయభయంకరమూర్తివి అయి కూడా నీవు నిగ్రహం చూపినావు. నీ ధీరత్వం పొగడడం నా తరమా!?
     2.  ఈనాడు రహస్యంగా కీచక వధ నర్తనశాలలో చేసిన నీ కార్యనిర్వహణా నైపుణ్యం తలపోయడం నా తరమా !?
    3. ఇంత దుష్కరమైన కార్యానికి పాండవులలో ఇంకెవరినీ సహాయం అర్థించకుండా, ఒంటరిగా నిర్వహించిన నీ సాహసమును మెచ్చుకోవడం నా తరమా!?
   4. ఎన్నడూ లోకంలో కనీవినీ ఎరుగని రీతిలో కీచకుని వధించావు. నీ పరాక్రమ విలాసాన్ని కీర్తించడం నా తరమా!?
   5. నీ ఉత్తమ నాయకత్వలక్షణాలను అన్నింటినీ తెలిసికోవడానికి నేనెంతదానను . నీ ఈ కృత్యం చూసి నేను సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాను అన్నది. 
          ఇది తిక్కన నేర్పు. ఇంకేమి, భీముడు ఉప్పొంగిపోయాడు. అక్కడ ఉండడం ఆలస్యం చేయడం మంచిదికాదని  ద్రౌపది ని  హెచ్చరించి భీముడు అంత రహస్యంగా తన వంట ఇంటికి వెళ్ళిపోయాడు. 

కీచకవాద ఘట్టంలోతిక్కన నాటకీయత


          విరాటపర్వం ఊర్జిత కథలో బిగిని, నాటకీయతలో జిగిని సంతరించుకున్నది పైగా తిక్కన్న చేతిలో పడింది . ఈ కథలో నాటకీయత ఆయా అంశాలను ఆశ్రయించి ఆవిష్కృతం అవుతున్నది. తిక్కన వీటినన్నిటిని తన నైపుణ్యంతో పరిఢవిల్ల చేసాడు .  
1. కథా సన్నివేశాలను నాటకరంగాలుగా తోచేటట్లు రూపొందించడం - అనగా రంగపరికల్పనం . 
2. పాత్రల సంభాషణనే  కథకు ప్రాణం పోస్తున్నట్లు నిర్వహించడం ఇది సంభాషణ శిల్పం . 
3. మాట్లాడే పాత్రలు చతుర్విధాభినయంలో జీవిస్తున్నట్లు చిత్రించడం - ఇది చతుర్విధాభినయా ప్రదర్శనాచాతుర్యం
4. కథలో సహజంగా సాగే వర్ణానాంశాలను రూపక మర్యాదలుగా మలచడం - రూపక మర్యాదల కల్పనం .    
5. రసాభ్యుదయోల్లాసంతో పాటు రసాభ్యుచిత బంధాన్ని కూడా పోషించి రక్తి కట్టించడం. శ్రావ్య కావ్యశైలితో దృశ్యకావ్య శైలిని సమన్వయించడం . 
6.  ఉభయకావ్య శిల్పాలను ఔచిత్య పోషకంగా వికసింపచేయడం - ఉభయకావ్య ప్రౌఢి పాటించే శిల్పం . 
          వీటిని సమన్వయించుకుంటూ సమీక్షిస్తే తిక్కన లోని నాటకీయత సాక్షాత్కరిస్తుంది .  
          కీచకవధ ఒక్కటి ఒక చిన్న ఖండ కావ్యంగా భావించవచ్చు. పాఠ్యాంశంలో మూడే పాత్రలు. రంగస్థలం, నర్తనశాల, పూర్వరంగం. విరాటుని కొలువులో ద్రౌపదికి జరిగిన అవమానం కీచకుడు వెంట తరుముకుని వచ్చి ఆమెను కింద పడవేసి తన్నాడు. ఇది చూసి భీముడు మహా ఉగ్రుడైనా ధర్మజుని కనుసన్నలతో తమాయించుకున్నాడు. కీచకునికి సంకేతం ఇచ్చి ద్రౌపది భీమునితో నా వంతు పని అయింది. ఈ రోజు  చీకటి రోజు అయింది, ఏమిచేస్తావో ఏమో అంది. భీముడు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, ఆ సందర్భంలో  ద్రౌపది  కవ్వించింది. ఈ రెండూ సంభాషణ పద్యాలే. పాఠ్యాంశంలో మరో సంభాషణ సందర్భం. కామోన్మత్తతో ఒళ్ళు తెలియకుండా కీచకుడి మాటలు వనితా నీకు మేలి వస్తువులు సమకూర్చి వచ్చాను. ఇప్పటికి నావల్ల మన్మథుడు స్త్రీల మనస్సులకై బాణాలు వేస్తే వారు తనకు లంచాలు ఇస్తారట. తనను జూచిన స్త్రీ ఇతరులను లెక్కచేయదని విరహంతో మీద మీద పడుతుందని మన్మథుని దెబ్బకు సైపు జాలదని తన మాటలే మగువలకు గాలం వంటివని, అప్పటివరకు తాను స్త్రీలను ఆకర్షించుకుంటుంటే ఇప్పుడు తనని మాలిని ఆకర్షించుకున్నాడని తనను  ఏలుకుంటున్దని పలవరించాడు . ఇంకా మాటలెందుకు చేతల్లోకి దిగుదాం అన్నాడు. ఈ ఉన్మత్త ప్రవాహానికి లోపల మండుతున్నా, భీముడు గొంతుమార్చి మృదువైన మాటల్తో బదులు చెప్పాడు. ఈ సంభాషణ పరితల మనస్సులో గిలిగింతలు పెడుతుంది. భీముని చేత తిక్కన నర్మగర్భంగా పలికాడు. నిన్ను నీవే పొగడుకొనడం సహజమే. నీవట్టివాడవే. నావంటి స్త్రీ నీకు దొరకదు. నీకు నా సంగమం లభించినప్పుడు నీ శరీరానికి ఏమౌతుందో నీవే తెలుసుకుంటావు. నన్ను సామాన్య స్త్రీలతో సమానంగా భావించితే తప్పుచేసినట్లే సుమా. నన్ను తాకిన తర్వాత మరొక స్త్రీ పొందుకు పోవు. ఇక ఏ ఆడువారి ముచ్చటలలోను ఆసక్తి చూపవు. నీపని ఆఖరు అని ధ్వని. ఇంతటి సంభాషణ చాతుర్యం తిక్కన ప్రదర్శించాడు. 
          మరొక్క సంభాషణ కీచకుని వికృతపు పీనుగునుచూసి ద్రౌపది సంభ్రమాశ్చర్యాలతో ముక్కున వేలేసుకుని, "కీచకా దీనికోసమేనా ఇంత చేసావు, సుఖంగా ఉందువుగాని, నన్ను సాధించిన నీకు ఇట్లా జరగకపోతుందా" అంది.
          భీముని మాటలు చూడండి. ద్రౌపది అవమానభారం తొలగించినానని  ఉల్లాసంతో భీముడిట్లా అన్నాడు. 
   1. ద్రౌపదీ  నీ మనస్సులో చింత అన్న ములికి తొలిగిందా?  
   2. నా భుజబలం ఏమిటో తెలిసిందా, నీ మెప్పుకెక్కిందా?
   3. నీ కోపాగ్ని చల్లారిన్దా?
   4. చచ్చిన ఈ దుర్మార్గుని చూసావా?
   5. సంతోషం కలిగిందా? అని నీ జోలికి వచ్చినవానికి నా చేతిలో మూడింది అన్నాడు. 
                      నర్తనశాలలోకి ప్రవేశిస్తున్న భీముని తిక్కన ద్రౌపదీరమణుడు అని వర్ణించాడు.  ఇప్పుడు ఆ పదం సార్థకం అయ్యింది. ద్రౌపదికి సంతోషం కలిగించాడు కదా. అంత సింహబలమర్దనుని చూసి ద్రౌపది ఇలా సంభాషించింది. ఇప్పుడు సార్థకంగా సింహబలమర్దనుడన్నాడు తిక్కన. ద్రౌపది చేత భీముని సంభాషణకు ధీటుగా తిక్కన ఇలా పలికించాడు. 
1. క్రిందటి రోజున విరాటుని కొలువులో ప్రళయభయంకరంగా విజృంభించబోయినా తమాయించుకొన్న నీ ధీరస్వభావ మహిమను చూడడం నా తరమా!
2. నర్తనశాలకీదినం అతి రహస్యంగా, నిస్సంకోచంగా రచ్చకార్యనిర్వహణ చేశావు. నీ సామర్త్యాన్ని తలపోయడం నా తరమా!
3. ఈ పనికై మన పాండవులలో ఎవరి సహాయం కోరకుండా ఒక్కడివే అపూర్వ కార్యసాధన చేసిన నీ సాహసం మెచ్చుకోవడం నా తరమా!
4. దుర్జయుడైన కీచకుని ఇంత భయంకరంగా వధించిన నీ పరాక్రమ విలాసం కీర్తించడం నా తరమా!
5. నీ ఉత్తమ నాయకత్వ లక్షణాలను తెలుసుకోవడానికి నేనెంతదానను!
          కావ్య వస్తువులో కార్యసాధన దశలను సూచించే పంచ సంధులు  ఉంటాయి. వాటిని తిక్కన ఈ పద్యంలో నిక్షేపించాడు . అవి 
1. ద్రౌపదికి సభలో జరిగిన అవమానాన్ని చూసి భీముడుకోపించడం బీజం. అది సీసపద్యం మొదటి పాద్యం చెపుతున్నది. 
2. కార్యాన్ని గుట్టుగా నిర్వహించడం నాయకుని కార్య నిర్వహణ దక్షతా సూచకం. ఇది ప్రతిముఖ సంధి లక్షణం. 
3. ప్రాప్త్యాశ  భీముడు ఏకవీరుడై అసాధ్యకార్యాన్ని సాహసంతో సాధించి నాయక లక్షణాన్ని నిరూపించుకున్నాడు. 
4. భీముడు సంకేతస్థలంలో స్త్రీ వలె శయ్యమీద కూర్చుండి స్త్రీ కంఠంతో మాట్లాడి విచిత్ర సంభాషణ చేయడం, గూఢమర్దన క్రియతో కీచకుని  సంహరించుటకు పూనుకొని వికృతపు చావు చంపిన భీమా పరాక్రమం కార్యనిర్వహణ సమార్తంగా ప్రకాశించింది. ఇది నాయక శ్రేష్ఠ లక్షణం. 
5. నిర్వహణ సంధి కార్యం + ఫలాగమం కీచకవధను కళ్లారా చూపించడం కార్యం. ద్రౌపదికి ఆనందం కలిగించడం ఫలాగమం. ఇది ఫలవంతంగా ప్రదర్శించబడింది. భీముని ఐదు ప్రశ్నలకు ఐదు అంచెల జవాబు చెప్పింది. ఇంత రసనిర్భరమైన  వ్యాఖ్యానం ఈ పద్యం. 
          తిక్కన సంభాషణ శైలి ఇంత నాటకీయంగా ఉంది. ఇక రంగస్థలం - దీన్ని తిక్కన ఎంత నాటకీయంగా చెప్పాడో  చూద్దాం. 
        రహస్యకార్యానికి సమయం చీకటి రాత్రివేళ, రంగప్రవేశము నిర్జనమైన నర్తనశాల దాని వర్ణనలోనే తిక్కన పాత్రల స్వభావాన్ని, శీలాన్ని  ప్రతిబింబించాడు. వ్యాసుడు చేయని ఈ వర్ణన తిక్కన నాటకీయతలో రంగస్థల నిర్మాణానికి పతాకస్థాయి. పగలు నాట్యశాల, ఆ రాత్రి కీచకవధశాల అవబోతుంది. కనుక సమయోచితంగా తిక్కన వర్ణించాడు.  
               సంభాషణ విషయంలో కీచకుని నీఛ సంభాషణ భీమునిది చతుర సంభాషణ. నాటకం అయితే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే  సరసత. 
          కీచకవధ  ప్రధానాంశం చీకటిలో చర్య కనపడదు కానీ జీవితాన్ని దీపపు వెలుగులో చూపించాడు.
          కీచకుడి మాటల్లో దిదగ్ధి శృంగారం, భీముని మాటల్లో హాస్యం, భీమ-కీచక పోరులో రౌద్రం, కీచకుని వికృత చావులో బీభత్సము , అది చూడటంలో ద్రౌపదికి కలిగిన విస్మయ, భయ, సంతోషాలు కలిసిన అద్భుతరసం. 
       గుప్తంగా, గంభీరంగా నర్తనశాలకు భీముని గమనం, మదోన్మత్తతో కీచకుని నర్తనశాల గమనం కనబడకపోయినా {చీకటివల్ల} వినిపించేలా భీముని నర్మగర్భ సంభాషణం  కీచకుని పీనుగాని చూసి ద్రౌపది విస్మయ అద్భుత రసాలు అన్నీ  అంతర్నాటకంలో భాగాలైనవి. 
          ఇంత నాటకీయత రంగస్థల నిర్వహణంలో, సంభాషణల్లో, రసోచితమైన వర్ణనలతో తిక్కన అద్వితీయంగా నిర్వహించాడు.